Saturday, March 11, 2017

మార్పు!!కనురెప్పల వెనకున్న బాధను ఓదార్చావు
నిదురించే సమయాన కలలను కరిగించావు
నవ్విస్తూ కవ్విస్తూ ఊసులు వల్లించావు
నీకోసమే నేనంటూ ఏవేవో చెప్పావు

నేనిచ్చిన నా ప్రేమే అపురూపం అన్నావు
నా ముందు నీకన్నీ త్రుణపాయం అన్నావు,
భాసటగా  నా తోడే నీ ధైర్యం అన్నావు
 నాతోడే ఈ జీవిత పరమార్థం అన్నావు
విశ్వంలా మన ప్రేమకు అంతేలేదన్నావు

నా మంచే అన్నావు, నన్నే విడిపోయావు,
నా గాయం ఈ సమయం మానేస్తుందని అన్నావు
మనవంటూ పేర్చిన ఆ కలలను వదిలేసావు
నన్నే ఏమార్చేస్తూ ఏదేదో చెప్పావు!

కన్నీళ్ళే సాక్షాంగ నీకోసం వేచాను

నీ మార్పును గమనిస్తూ వర్షంలో నిలిచాను 

Wednesday, November 30, 2016

ఒక్కమాటతో!!

నా తోడే నీ బాధని
నా ఊసే నీకు శాపమని
నా మాటే ఒక మోసమని
నా ప్రేమే ఒక కపటమని,
నా వైపే ఇక చూడనని
గాయపడింది నా హృదయం
ఒక్కమాటతో మన బంధాన్ని తెల్చేసావని!!

నే వేచి ఉన్న రోజులు మరిచావా
నీ నవ్వు కోసమని
నాలో మార్పులు చూసావా
నీ సౌఖ్యం కోసమని
నా కన్నుల ఆరాటం గమనించావా
నీ ప్రతిబింబం కోసమని
అహాన్ని చేరనివ్వని నా తాపత్రయాన్ని తరిచావా
మన బంధం పదిలత కోసమని
బాధతో యదంతా భారమైంది
నేను చూపిన ఆప్యాయతను
ఒక నాటకం అనుకుంటున్నావని!!

కనుపాపకు నీరు చేరింది
నా ప్రేమ విఫలమైందని
ఆలోచనలు తరుముతున్నాయి
నా ప్రేమ నీకెందుకు తెలియలేదని,
నా ఉనికే నీకు భారం అయితే
కనిపించను నీకిక నీ సంతోషం కోసమని,
విలయపు వర్షంలో తడుస్తూ
వెలుగు కోసం వేచి చూసే వన్యంలా

వేచి ఉంటా నువ్వు అర్థం చేసుకుంటావని!!

Monday, September 26, 2016

నలుగురిలో ఇంకొకరు


“నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి!!!”

అందరం కలిసి ట్రిప్ కి ఎక్కడికి వెళ్ళాలి అన్న ప్రశ్న వచ్చినప్పుడు, తన మనసులో ఉన్నది చెప్పరు, వేరే వాళ్ళ మనసులో ఉన్నది మాత్రం అడుగుతారు. సరే, విన్నాక ఏదో ఒక నిర్ణయానికి వస్తారా అంటే అదీ కాదు, మిగిలిన వాళ్ళందరూ ఒకే మాట చెప్పాలంటారు. నలుగురు మనుషులు ఉన్నప్పుడు అందరూ ఒకే మాట మీద నిలపడి ఉండటం కష్టం కదా, అదే ట్రిప్ కి ప్రదేశం విషయం లో మరీ కష్టం!! కాని వీళ్ళు మాత్రం అందరూ ఒకే మాట, ఒకే పాట పాడే వరకు వీరు పాట పాడరు. 

సరే అందరూ మాట్లాడి ఒక మాట పై కి వచ్చాక ఫైనలైజ్ చేస్తారా అంటే అదీ లేదు, మళ్ళీ ఏదో ఒక వంక పెట్టడానికి ప్రయత్నిస్తారు. అందరూ సంతోషంగా రావాలంటారు, ఒక వ్యక్తి రాకపోతే నేను రాను అంటారు, అసలు అవసరమా ఈ ట్రిప్ అనేలా ఇండైరేక్టు గా చెప్తుంటారు. కాని బయటికి మాత్రం ‘ఆ నలుగురు’ సినిమాలో రాజేంద్రప్రసాద్ లా నవ్వుతూ  తిరుగుతారు.

ఇలాంటి వాళ్ళు మిగిలిన ముగ్గురి బాధ్యతా భుజానా వేసుకుంటారు, ట్రిప్ వ్యవహారాన్ని ముందుండి చక్కబెడుతుంటారు, ప్రతీ పనిని అందరి సలహాలు తీసుకొని పూర్తి చేస్తుంటారు. అందరి ఆనందమే తన ఆనందం అని మనస్పూర్తిగా ట్రిప్ కి వారి జీవిత రోజులను అంకితం చేసే అమాయకులు. కాని వీరి అందరూ బాగుండాలి అన్న మాటి మాటి డైలాగులు కొంచం ఇబ్బంది కలిగిస్తాయి.

వాళ్ళు ట్రిప్ లో సాధారణంగా అనే మాటలు:

“మరి ఏమంటారు, అందరికీ ఒకే కదా!!”
“మీకు ఏమైనా సమస్య ఉంటె ముందే చెప్పండి, ప్లాన్ లో మార్పులు చేద్దాం”
“ఆ వ్యక్తి కి కోపం వచ్చినట్టుంది, మీరిక్కడే ఉండండి నేను సర్ది చెప్పి వస్తాను”
“నీకు ఒకే కదా!!!”
“నాదేం లేదు, మీరు ఏది అంటే నేను అదే”
“మీ ఇష్టం”
“నాకేదయినా ఒకే”
“మీరు చెప్పండి ముందు”
“ఎలా చేద్దాం మరి”

లోపాలు

మనకు కొందరి  వ్యక్తుల విలువ, వారు దూరం అవుతున్నప్పుడు, అయినప్పుడు ఎక్కువ తెలుస్తుంది. వారు మనతో ఉన్నప్పుడు వారి ప్రాధాన్యత మనకు కనిపించదు, మనకు వాళ్ళ లోపాలే ఎక్కువగా కనిపిస్తాయి. ఆ లోపాలనే పెద్దగా చూస్తూ వాళ్ళను విమర్శించడం, మనం వాళ్ళ వల్ల ఇబ్బంది పడిపోతున్నాం అని ఎక్కువ ఫీల్ అయిపోతుంటాం. కాని కొన్ని సంవత్సరాల తరువాత వెనక్కి మళ్ళి చూసుకుంటే మనకు వారి విలువ మాత్రమే కనిపిస్తుంది. వారి లోపాలు మనకు వారి వ్యక్తిత్వం ముందు సముద్రం లో చుక్క నీరులా అనిపిస్తుంది. కాని అప్పటికే సమయం చేజారిపోతుంది, కేవలం వారి జ్ఞాపాకలు తప్ప వారు మన జీవితంలో ఉండరు. ఎవరో రచయిత చెప్పినట్లు, మన జీవితం లో ఆఖరుసారి ఒక వ్యక్తిని కలిస్తే వాళ్ళతో ఎలా ఉంటామో ఉహించుకొని, వారితో అలాగే ప్రతీ సారి కలిసినప్పుడు ఉంటె, వారి లోపాల కంటే వారి వ్యక్తిత్వ ఔన్నత్యం కనిపిస్తుంది.