Saturday, March 25, 2017

మూడో వ్యక్తిఒకరోజు ఆఫీసులో పని చేస్తున్నాను, ఇంతలో నా సహోద్యోగి ఒకరు వచ్చి మా ఆవిడ మన ఆఫీసు దగ్గరికే వచ్చిందండి, తను బయట వెయిట్ చేస్తుంది. మీరు కూడా రండి, పరిచయం చేయిస్తాను అని చెప్పారు. ఆ సహోద్యోగి నాకు కొన్ని సంవత్సరాలుగా పరిచయం ఉండటం, దేశం కాని దేశంలో ఉన్నప్పుడు కలివిడిగా ఉండటం అవసరం కాబట్టి, సరే అని చెప్పాను. తను నేను కలిసి బయటకు వెళ్ళాము.  తను ఒక్కతే అక్కడున్న కుర్చిలలో కూర్చొని ఉంది. నా సహోద్యోగి నన్ను పరిచయం చేసారు, తను మామూలుగానే నన్ను హాయ్ అని పలకరించింది.

నా సహోద్యోగి వాళ్ళ ఆవిడతో ఏదో చెప్పబోతుండగా, తను అతని వైపు తిరిగి, “నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో!!” అని గట్టిగా అరిచేసింది. ఆమె కళ్ళలో ఒక రకమైన రేజ్, తన బాడీ లాంగ్వేజ్ మొత్తం కోపంతో నిండి పోయింది.  

“లేట్ వచ్చినందుకు కోపం వచ్చిందా!” అని అతను అననూయంగా అడిగినా,

అతని గొంతులోని ఆవేదనను ఆమె గమనించకుండా, “నేను వచ్చి ఇరవై నిమిషాలు అయ్యింది, ఎంత సేపు వెయిట్ చెయ్యాలి?” అని కోపం తో ఊగిపోతూ అంది.

“అది... నువ్వు కాల్ లేక మెసేజ్ చేస్తావేమో అనుకు….న్నా….” అని అతను సముదాయిస్తూ అంటుండగానే, తను తన పరిసరాలను గమనించనంత కోపం తో ఊగిపోతూ, “ఏలా కాల్ చేయాలి? ఈ ఫోన్ తోనా!!!” అంటూ చేతిలో ఉన్న ఫోన్ ను నేలకేసి కొట్టింది.  ఆ అబ్బాయికి ఏం చేయాలో అర్థం కాలేదు, మెల్లిగా వెళ్లి తను కింద పడేసిన మొబైల్ ని తీసుకున్నాడు.

ఇదంతా నా కళ్ళ ముందే జరుగుతుంది. నేను ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. ఛ!! అనవసరంగా వచ్చానా అనిపించింది!! చాలా ఇబ్బందిగాను, కొంచెం చిరాకుగాను అనిపించింది. నేను ఆ అబ్బాయి వైపు తిరిగి, “నేను వెళ్ళనా మరి!!” అని అన్నాను. చేసేదేం లేక అతను సరే అన్నాడు.

ఏదైనా ఉంటె తరువాత మాట్లాడుకోవాలి కాని, మూడో వ్యక్తి ముందు అరుచుకోవటం, కొట్టుకోవటం, చేతిలో ఉన్నదీ పడేయటం ఏంటో నాకు అర్థం కాదు. కోపంలో ఎవరి ముందు ఉన్నాము, ఎక్కడ ఉన్నాము, మనం అనే మాటల/చేతల వలన జరిగే నష్టాలను, అనుబంధాలలో వచ్చే ఆ పగుళ్ళను బేరీజు వేయకపోతే ఎలా? మన కోపాన్ని మనం ఎలా నియంత్రిస్తున్నాము అన్న దాని పైనే మన మానసిక పరిపక్వత ఆధారపడి ఉంటుంది. మామూలు సమయంలో అందరు బాగానే ఉంటారు, ఆ మామూలుకు అటు ఇటు అయినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తామో, అదే మన అసలు నిజ స్వరూపం. జంటల మధ్య సవాలక్ష సమస్యలు ఉండొచ్చు, అది అందరి ముందు వికృతంగా ప్రవర్తిస్తూ తమ బాగస్వామి పై విరుచుకుపడటం ఏమిటో! ఎదుటి బాగస్వామిని భరించలేనంతగా పట్టలేని ఆవేశం, కోపం ఉన్నప్పుడు ఆ బంధానికి ఇక విలువ ఏమి ఉంటుందో ఆలోచించాలి!!


తరువాత రోజు నా సహోద్యోగి వచ్చి నేను ఇబ్బంది పడ్డందుకు క్షమాపణ కోరాడు. కొసమెరుపు ఏంటంటే, ఆ సహోద్యోగి వాళ్ళ ఇంటికి బోజనానికి ఆహ్వానించారు!!


3rd tm

1 comment:

  1. మీరు చెప్పినది అక్షరాలా నిజం. చాలా సున్నితంగా వ్యవహరించవలసిన సంగతి. నలుగురిలో నోరుపారేసుకుంటే ఎవరికి ముప్పు అన్నది ఆవిడ గ్రహించినట్టులేదు. .

    ReplyDelete