Saturday, April 29, 2017

నేను బాహుబలి – 2 సినిమా ధియేటర్లో చూడను


 ఎవరో అడిగారు నన్ను, “ఏంటి బాస్, ఆ సినిమా చూస్తున్నారా మొదటి రోజు”, ధియేటర్ లో ఆ సినిమా చూడొద్దని నిర్ణయించుకున్నా అని చెప్పా! ఏదో గ్రహాంతరవాసిని చూసినట్లు నన్ను అదో రకంగా చూసారు.

నాకు సినిమా అంటే ఒక ఖాళీగా ఉన్నప్పుడు ఆహ్లాదం కోసం చూసే వినోదం. అది హోదాకు చిహ్నం కాదు. మొదటి రోజు, మొదటి వారం చూసాను అని సామాజిక మాద్యమాలలో, స్నేహితులతో చెప్పుకోవటానికి! నేను మొదటి రోజు చూసినా, 100 వ రోజు చూసినా కథలో ఉండే మార్పేమీ లేదు.

ఇక ధియేటర్ లో చూడకపోవటానికి కారణం, ఆ సినిమా వ్యాపార ధోరణి సామాన్య ప్రజలను దోపిడి చేసే విధంగా ఉంది. ఆ సినిమా ప్రచార కార్యక్రమాల విధానాలు ప్రజల్లో మాస్ హిస్టీరియా పెంచేలా ఉన్నాయి. ఆ సినిమా ఏదో నిత్యావసర వస్తువు అయినట్లు, చూడకపోతే చచ్చిపోతారు అన్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా, మీడియా ద్వారా సామాన్య ప్రజలలో ఒక రకమైన ఆర్టిఫిసియల్ కంపల్షన్ తయారు చేయటం లో సఫలీకృతం అయ్యారు. తెలుగువారి గౌరవం అని ఇక్కడ, దక్షిణ భారతదేశ సంపద అని ఇక్కడి రాష్ట్రాల్లో, మన దేశ గౌరవం అని ఉత్తర రాష్ట్రాల్లో వ్యాపారాత్మక ప్రతిష్ట ను నెలకొల్పి, టికెట్ల ధరను కొన్ని రెట్లు అమాంతంగా పెంచేసి ప్రజలను నిలువునా దోపిడి చేస్తున్నారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యుటర్లు, సినిమా హాల్ యజమాన్యాళ్ళు, ప్రభుత్వ యంత్రాంగాలు, ఇవన్ని జరుగుతున్నాయని తెలిసి కూడా ఏమి చేయాలేక పోతున్న సినిమా నక్షత్రాలు – వీళ్ళందరూ ఈ దోపిడిలో భాగస్వాములే!

వీళ్ళందరూ ఒక వైపు అయితే, ఈ దోపిడీకి మనమే సహకరిస్తున్నాం, ఈ మాబ్ మెంటాలిటీ మాయలో పడి. ఒక వారం తరువాత, 100 రూపాయలకు దొరుకుడుంది అన్నప్పుడు, ఈ రోజే 4౦౦౦ పెట్టి సినిమా చూడటం వల్ల వచ్చే లాభం ఏంటో? ఎందుకు కిలోమీటర్ల కొద్ది లైన్లలో నిలపడి మరీ ఆ సినిమాను మొదటి రోజు మొదటి ఆట చూడాలని అనుకోవటం? ఎందుకు నానా కాళ్ళు పట్టుకొని ఏదో ప్రాణం పోతుంది అన్నట్లు టికెట్ల కోసం వెంపర్లాడటం? అమీర్ పేట నుంచి అమెరికా వరకు ఇదే పరిస్థితి, అదే మొబ్ మెంటాలిటీ (మన ‘మంచి’ మీడియా దీన్ని ‘ఫీవర్’ అని టోన్ డౌన్ చేస్తుంది).

వారి ఇష్టం భయ్యా, 4౦౦౦ కొంటారు, 4౦,౦౦౦ లకు కొంటారు, కొనే వాళ్ళకు లేని బాధ మీకెందుకు అని మీరనొచ్చు, దానికి సమాధానమే నా ఈ చిన్ని కథ:  

ఒక ఊర్లో ప్రతీ వారం అంగడి పెట్టేవారు. అక్కడ ఒక వ్యాపారి చెక్కలతో చేసిన ఆట బొమ్మలని అమ్మేవాడు. అక్కడికి వచ్చే రైతులు, ఆసాములు, కూలీలు మొదలైన వాళ్ళందరూ, ఈ వ్యాపారి చెప్పే మొదటి ధరకు, సగం వరకు బేరమాడి ఆట బొమ్మలని కొనేవారు. అలా సగం ధరకి అమ్మినప్పటికీ, ఆ వ్యాపారికి లాభం మిగిలేది.  

కొన్ని మాసాల తరువాత, ఆ అంగడిలో కొంత మంది కొత్త ఆసాములు రాసాగారు, వాళ్ళకు వచ్చిన నడిమంత్రపు సిరి వల్ల, హోదా చుపించుకోవటానికి, వాళ్ళు ఈ వ్యాపారి చెప్పిన మొదటి ధరకే ఆ బొమ్మలని కొనటం మొదలు పెట్టారు. ఈ కొత్త ఆసాములకు అమ్మటం వల్ల ఈ వ్యాపారికి లాభం రెట్టింపు అవటం, తన బొమ్మలకు డిమాండు పెరిగింది అనుకొని, తన బొమ్మలను మొదటి ధరకు మాత్రమే అమ్మటం మొదలు పెట్టాడు. మిగిలిన ఆసాములు, కొంత మంది పెద్ద రైతులు మాత్రమే ఈ వ్యాపారి వద్ద కొనేవారు. అమ్మకాలు కొంచెం తగ్గుముఖం పట్టినా, లాబాలు మాత్రం గణనీయంగా పెరగటం తో ఈ వ్యాపారి బేరం ఆడటం మానేసాడు. ఈ వ్యాపారిని చూసి ఆ జాతరలో ఉన్న మిగిలిన వ్యాపారులు కూడా బేరం ఆడటం మానేసి అమ్మటం మొదలు పెట్టారు.
 
దాంతో బొమ్మల ధర పెరిగింది, కాని ఆ మొత్తం ప్రదేశం లో ఉన్న వ్యక్తుల ఆదాయం మాత్రం అంతే ఉంది. దీని వలన ఆ బొమ్మలు సామాన్యులకి అందుబాటులో లేకుండా అయిపోయాయి. ఈ బొమ్మలు నిత్యావసర వస్తువులు కావు, కాబట్టి ఆ స్తోమత లేని వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఆ అందమైన చెక్క బొమ్మలను కొనివ్వటం మానేయాల్సి వచ్చింది.  

ఇదే సినిమా మాబ్ మెంటాలిటీ లో కూడా జరుగుతున్నది!     

నేను ఆ సినిమాను వేరే మార్గాల ద్వార చూస్తాను కాని ధియేటర్లో చూడను, ఈ మొత్తం సినిమా దోపిడి పట్ల నా నిరసన.
ఇక నేను చూడకపోవటం వలన ఆ సినిమాకి వచ్చే నష్టం ఏమి లేదని నాకు తెలుసు, నష్ట పోవాలి అని కూడా నేను అనుకోవట్లేదు, కాని నేను టికెట్ కొనటం వలన ఆ దోపిడీ మాయాజాలానికి నా వంతు ఆజ్యం పోసినట్లవుతుంది, అది నాకు ఇష్టం లేదు. ఒక  సామాజిక గ్రూపు పరంగా మనమంతా ఈ వ్యవస్థీకృత దోపిడీ నుంచి, ఈ సినిమా మాబ్ మెంటాలిటీ నుంచి ఎంత తొందరగా బయటకు  వస్తే అంత మంచిది.


  

3 comments:

  1. బాగా చెప్పారు చిరఃజీవి , ఎలాగూ అందరూ చూసేటప్పుడు వచ్చె డబ్బు చాలదన్నట్టు... ఇంకా ఎక్కవ డబ్బు చేసుకోవాలనే తొందర ఎందుకో...

    ReplyDelete
  2. 👏 చిరంజీవి గారు. బాగా చెప్పారు.
    నాదీ మీ పంథాయే. ఈమధ్య కాలంలోఇలా ఎగబడడం ఓ ఫాషన్ స్టేట్మెంట్ అయిపోయినట్లనిపిస్తోంది. ఇంత హైప్, దోపిడీ లేని పాతరోజులలో కూడా సినిమా విడుదలయిన పది పదిహేను రోజుల తరవాతే చూసేవాడిని. ఇప్పుడసలు థియేటర్ కి వెళ్ళడమే మానేసి కొన్ని సంవత్సరాలయింది.

    ReplyDelete